నాగర్‌కర్నూల్, ఆగస్టు 8 : కాంగ్రెస్ ప్రభు త్వం ఇరవై నెలల పాలనలో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించిందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి విమర్శించారు. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం అచ్చంపేటలో నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు బైకాని శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ శాంతకుమారి, అభిలాష్‌రావు, పోకల మనోహర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తున్న తీరును వారు ఎండగట్టారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీని వీడటం బాధాకరమని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రెండేండ్లలో ఏమీ చేయలేని సర్కార్ మూడేళ్లలో ఏం చేస్తదని ఎద్దేవా చేశారు.
గువ్వల వెళ్లడం బాధాకరం: శ్రీనివాస్‌గౌడ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో గువ్వల పార్టీని వదిలిపెట్టిపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు.
అచ్చంపేట క్యాడర్లో చైతన్యం : లక్ష్మారెడ్డి
అచ్చంపేట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లోని చైతన్యాన్ని చూస్తుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఈ నియోజకవర్గం ముం దుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు. నాయకుడు లేకున్నా.. పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ వెంటే ఉంటామని ప్రకటించడం అభినందనీయమని అన్నారు.
గువ్వల రాజకీయ జీవితం నాశనం : మర్రి
పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన రాజకీయ జీవితాన్నే నాశనం చేసుకున్నాడని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతోనే మరోసారి అచ్చంపేటలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. పార్టీ మారే నాయకులకు అచ్చంపేటలో నిర్వహించిన పార్టీ శ్రేణుల కుటుంబ ఆత్మీయ సమావేశం చెంపపెట్టుగా మారుతుందని అన్నారు.