హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో సంప్రదాయానికి, నిబంధనలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తున్నదని, ఈ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇవ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి, సంప్రదాయాలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ ఖూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అరికెపూడి గాంధీని అడ్డుపెట్టుకొని రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పీఏసీకి హరీశ్‌రావు వేసిన నామినేషన్ పత్రాలు ఏమయ్యాయని, హరీశ్ అంటే రేవంత్‌కు ఎందుకంత భయమని ప్రశ్నించారు. స్పీకర్ భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చాలని చూస్తున్నారని, మొన్న జర్నలిస్టుల మీటింగ్‌లో సీఎం రేవంత్ నీతులు చెప్పి, తెల్లారే గోతులు తవ్వారని ఎద్దేవా చేశారు. నామినేషన్ వేయని అరికెపూడి గాంధీకి పదవికి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని, దీనిపై స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు. బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్‌తో కలిసి తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వ్యవస్థలను ధ్వంసం చేశారని కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్, పీఏసీ కమిటీల విషయంలో అతి పెద్ద ధ్వంసం చేశారని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ మాట కూడా వినలేని స్థాయికి రేవంత్ వెళ్లారా?, కాంగ్రెస్‌లో సీనియర్ అయిన జానారెడ్డి లాంటి వారు కూడా రేవంత్‌కు చెప్పే స్థితిలో లేరా?’ అని ప్రశ్నించారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కమిటీల ఎన్నిక షెడ్యూల్ ప్రకటించారని, పీఏసీ ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ అసెంబ్లీలోనే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించాలని, కానీ అందుకు విరుద్ధంగా 38 రోజుల తర్వాత కమిటీలను ప్రకటించారని చెప్పారు. బీఆర్ఎస్కు నిబంధనల ప్రకారం పీఏసీలో ముగ్గురు సభ్యులకు అవకాశం ఉంటుందని, తాను, హరీశ్‌రావు, గంగుల కమలాకర్ నామినేషన్ వేసినట్టు తెలిపారు. కానీ మధ్యలో అరికెపూడి గాంధీ పేరు ఎకడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. సభ్యుల కన్నా ఎకువ నామినేషన్లు వస్తే ఓటింగ్ జరగాలని, కానీ ఓటింగ్ జరగకుండానే హరీశ్‌రావు నామినేషన్‌ను ఎలా తొలగించారని నిలదీశారు.
ఇదే విధానంలో ఢిల్లీలో అమలైతే?
తెలంగాణ ఏర్పడ్డాక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన పీ కృష్ణారెడ్డి, గీతారెడ్డి, అక్బరుద్దీన్‌లకు నిబంధనల ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడు, నాగం జనార్ధన్‌రెడ్డికి పదవి ఇచ్చాని చెప్పారు. మోదీ హయాంలో మొదటి రెండు పర్యాయాలు కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకున్నా పీఏసీ చైర్మన్ పదవులు దకాయని, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సూచన మేరకు కేసీ వేణుగోపాల్‌కు కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని, కాంగ్రెస్‌కు ఢిల్లీలో ఓ సూ త్రం, తెలంగాణలో మరో సూత్రమా? అని నిలదీశారు. రేవంత్ విధానాన్ని ఢిల్లీలో పాటిస్తే అకడ కేసీకి పీఏసీ చైర్మన్ పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పెన్షన్ తొలగించారని, తె లంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు పిలిచి పీఏసీ పదవి ఇచ్చారని ఇదేం ద్వంద్వ వైఖరి అని ధ్వజమెత్తారు. పీఏసీపై స్పీకర్ నిర్ణయం మారకపోతే ఇతర మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు. గాంధీ బీఆర్ఎస్కు చెందిన వాడని మంత్రి శ్రీధర్‌బాబు చెప్తున్నారని, గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించాలని కేసీఆర్ సూ చించారా? అని, కేసీఆర్‌ను ఎపుడు సంప్రదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పెద్ద నియంతలా మారాడని, ఆయన తీరును ప్రతిఘటించి తీరుతామని హెచ్చరించారు.