హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ చరిత్ర సమాధి అవడం కాదని.. సీఎం రేవంత్‌కు కొడంగల్‌లో రాజకీయ సమాధి ఖాయమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదో తరగతి ఫలితాల విడుదల, బసవేశ్వర జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో రేవంత్‌రెడ్డి కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలపై వేముల ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో రాసి ఉంటుందని తెలిపారు. ఓటుకు నోటు కేసు ముద్దాయిగా, ఒక విఫల సీఎంగా రేవంత్ పేరు ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ సభ విజయవంతం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తాను కమిట్మెంట్ ఇస్తే మాట తప్పను అని మహాత్మా బసవేశ్వరుడి సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ చరిత్రను సమాధి చేసేంత శక్తి, స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని తెలిపారు.
చిరకాలం కేసీఆర్ పేరు
రూ.2000 ఆసరా పింఛన్ అందుకున్న అవ్వ తాతలు, బీడీ కార్మికుల చిరునవ్వుల్లో, రూ.4000 పెన్షన్ అందుకున్న దివ్యాంగుల్లో, రైతుబంధు, రైతు బీమా పొందిన లక్షల మంది రైతుల కుటుంబాల్లో కేసీఆర్ ఉన్నారని వేముల గుర్తుచేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడిన వ్యక్తిగా కేసీఆర్ పేరు రాష్ట్ర చరిత్రలో కలకాలం నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.
రేవంత్‌ది ఫ్రస్ట్రేషన్
లక్షల మంది తరలివచ్చిన వరంగల్ సభలో కేసిఆర్ తన పేరు తీయలేదనే ఫ్రస్ట్రేషన్లో రేవంత్‌రెడ్డి ఉన్నాడని ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘నేను అబద్ధాలు మాట్లాడను కానీ చెప్పేటివి నిజాలు కావు’ అన్న చందంగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని చురకలు అంటించారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నారా అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.