మోర్తాడ్, ఏప్రిల్ 7: అధికారంలోకి వస్తే వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. వంద రోజులు దాటినా హామీల అమలు ఎటుపాయె? అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లోని లలితా గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణమని హామీ ఇచ్చి బస్సుల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. ఉచిత విద్యుత్తు కొందరికే ఇస్తున్నారని, సిలిండర్ సబ్సిడీ ఏ ఒక్కరికీ వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.
అసెంబ్లీలో హామీల అమలు గురించి అడిగితే 50 రోజులకే అడిగితే ఎలా ఇంకా సమయం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని, మరి ఇప్పుడు వందరోజులు దాటిన హామీల అమ లు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ రూ.2 లక్షల విషయంలో ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లు సీఎంగా కేసీఆర్ చేసిన కృషి అభినందించదగినదనే విషయాన్ని ఇప్పు డు ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చినప్పటినుంచి ఇటు రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీలు మారిన వారిని పిచ్చికుక్కలను కొట్టినట్టు కొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. పార్టీలు మారిన వారిని కొట్టాలా? పార్టీలు మారేలా ప్రోత్సహిస్తున్న వారిని కొట్టాలా? అని ప్రశ్నించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెప్పిస్తానని బాండ్ పేపర్ రాసి చ్చి ఇక్కడి ప్రజలు, రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు కార్యాలయం ఎక్కడ ఉన్నదో చూపించాలని డి మాండ్ చేశా రు. హామీల అమలు విషయంలో ప్రజల పక్షా న ప్రశ్నించే గొంతుకగా నిలబడే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఎంపీగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని తెలిపారు.