హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఒక్కరే ఎంపీగా ఉండి తెలంగాణ సాధించగా లేనిది, 311 మంది ఎంపీలున్న కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా చేసిన కాంగ్రెస్ ప్రధానమంత్రిని కానీ, రాష్ట్రపతిని కానీ ఎందుకు కలవలేదని ప్రశ్నించారు.
జీవో పేరుతో కొత్త డ్రామా
బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకువస్తామని అసెంబ్లీలో తీర్మానించి ఢిల్లీకి పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా, రిజర్వేషన్లు కోసం జీవో విడుదల చేస్తామని చెప్పడం కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినట్టుగా ఉందని శ్రీనివాసగౌడ్ ఎద్దేవా చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ భూస్థాపితమే
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తమిళనాడు తరహాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ హెచ్చరించారు. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఐదేండ్లలో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారని, ఈ బడ్జెట్లో ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. క్యాబినెట్లో 8 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ఇద్దరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కిషోర్‌గౌడ్, శుభప్రద్‌పటేల్, గౌతంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.