హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్క లెక్చరర్ కూడా లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 25 వరకు ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అలాంటి కాలేజీల్లో విద్యార్థులు ఎలా చేరుతారని, ఎలా చదువుతారని సర్కారును నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో 35 శాతం గెస్ట్ లెక్చరర్లతోనే విద్యాబోధన కొనసాగుతున్నట్టు చెప్పారు. కాలేజీలు మొదలై నెలరోజులు కావస్తున్నా నేటికీ గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని తెలిపారు.
ఇంటర్లో 1,654 మంది, డిగ్రీ కాలేజీల్లో 1,342 మంది గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ రెన్యువల్ చేయాలని హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రైవేటు విద్యాసంస్థల ఒత్తిడితో గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తలేరా? లేదా ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు. లెక్చరర్లు లేకే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు కాలేజీలకు పంపుతున్నారని చెప్పారు. వారికి వేతన పెంపుతోపాటు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా, మాఫియాగా మారి కొత్త కాలేజీలు రాకుండా, ప్రైవేటు కాలేజీలను ఎదగకుండా నియంత్రిస్తున్నాయని విమర్శించారు. పేదల విద్యార్థుల భవిష్యత్తుపై అలసత్వం వహిస్తే బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్వీ నాయకుడు తుంగ బాలు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో లెక్చరర్ల భర్తీకి మహిళా సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది. ఇందుకు సంబంధించిన జేఎల్ పోస్టుల బ్రేకప్‌లో సవరణల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. జూనియర్ లెక్చరర్ల భర్తీకి 2022 డిసెంబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.