హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘మంత్రులు మానవత్వం మరిచారా? ఆడబిడ్డ మాగంటి సునీతమ్మ తన భర్తను తలచుకొని, సభకు వచ్చిన ప్రజాస్పందనను చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆమె భావోద్వేగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?’ అని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌పై మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సానుభూతి కోసమే కంటతడి పెట్టుకున్నారం టూ మంత్రులిద్దరూ చేసిన వ్యాఖ్యలను ఖం డించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహ్మత్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ సభ లో ప్రజల నుంచి వచ్చిన స్పందనతోనే మాగంటి సునీతాగోపీనాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్‌ను డిమాండ్ చేశారు.
మాగంటి సునీతాగోపీనాథ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న సమయం లో పక్కనే మేయర్ విజయలక్ష్మి, పీజేఆర్ కూ తురు విజయారెడ్డి ఉన్నారని, వారిద్దరూ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని గుర్తుచేశారు. ఆ సమయంలో నగర మేయర్ స్పందించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, మంత్రులకు ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే వారి వెన్నుల్లో వణుకు పుడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. మంత్రులు తుమ్మల, పొన్నం మహిళా లోకాన్ని అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. ఒక ఆడబిడ్డను అవమానించిన ఇలాంటి మంత్రులు తెలంగాణలో ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు.