హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీలను కాంగ్రెస్ సర్కార్ నిలువునా ముంచిందని, 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల విధానంపై ఎక్కడా నిబంధనలు పాటించలేదని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసంచేసిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకుని, పంచాయతీ ఎన్నికల్లో మహిళలు ఓట్లేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని తప్పుబట్టారు. సీఎం ఈవిధంగా బహిరంగంగా ఓట్లుఅడుగుతుంటే, ఎన్నికల కమిషన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
బీజేపీ ఎందుకు స్పందించడం లేదు?
బతుకమ్మ చీరల పేరు చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి ఓట్లడుగుతుంటే.. బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీ వైఖరి ఉన్నదని దుయ్యబట్టారు. కొన్ని మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు రిజర్వ్ కాలేదని, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. గతంలో పదేండ్లు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని, గత 60 ఏండ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా.. కొడంగల్ నియోజకవర్గాన్ని అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు.
జీవో 46 వద్దు: యాదయ్యగౌడ్
‘పంచాయతీ ఎన్నికల్లో అన్నింటినీ కలిపి 50 శాతంలోపు రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తెచ్చిన జీవో46ను రద్దుచేయాలి. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించినట్టుగా 42% బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయాలి’ అని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు.