హైదరాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటివాటాలపై రేవంత్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ కూడా పెట్టలేదని ఆరోపించారు. పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమ వాటా నీటిని యథేచ్ఛగా వినియోగించుకుంటున్నా తెలంగాణ ప్రభు త్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఎంత నీరు తరలిపోతున్నదో కనీసం లెకలు కూడా తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయ న మీడియాతో మాట్లాడారు. నీరు దిగువకు తరలిపోతున్న రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని, నీటి పారుదల శా ఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన బాధ్యతలను విస్మరించారని ధ్వజమెత్తారు. త్వరలోనే ఆయనను కలసి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. రాజోలిబండ డైవర్షన్ సీమ్ (ఆర్డీఎస్) ప్రాజెక్టును తక్షణమే తుంగభద్ర బోర్డు పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు కోసం కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ పనులు వేగవంతం చేసున్నా.. తెలంగాణ ప్రభు త్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో లేని నీటి వివాదాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని, ఆయన హయాంలో ఏపీ నాయకులు ఎందుకు ఇంత ధైర్యం చేయలేదని ప్రశ్నించారు. వరదలు లేని సమయంలో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడంలో ఆంతర్యమేందని నిలదీశారు. కాళేశ్వరం బరాజ్‌లు సురక్షితమేనని ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూఫీఆర్ఎస్ సంస్థలు స్పష్టత ఇచ్చిన తర్వాతైనా కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్‌చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలమూరు పంపులనూ ఆన్ చేయాలని కోరారు.
ప్రాజెక్టులపై అవనగాహనే లేని రేవంత్: జైపాల్‌యాదవ్
సీఎం రేవంత్‌రెడ్డికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఎద్దేవా చేశారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 6.5 టీఎంసీలే కావడం వల్ల భీమా, నెట్టెంపాడు, ఆర్డీఎస్ కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే వలసల జిల్లా పాలమూరు రూపురేఖలు మారాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక పాలమూరు బిడ్డలు మళ్లీ వలసబాట పట్టే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పాలమూరు ప్రాజెక్టులకు ఒక రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.