హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : బీసీ కులగణన నిర్వహించి చట్టసభల్లో రిజర్వేషన్ కోటా కేటాయించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను పాతపద్ధతిలోనే కొనసాగించాలని, విద్యార్థుల ఖాతాల్లో ఫీజు నగదు జమచేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని స్పష్టంచేశారు. కొత్త విధానంతో లక్షలాది మంది బీసీ బిడ్డలు ఉన్నతవిద్యకు దూరమయ్యే ప్రమాదమున్నదని హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ జనాభాకు సంబంధించి అధికారిక గణాంకాలు లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమల్లో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయని వాపోయారు. రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని కుండబద్దలుకొట్టారు. చట్టసభల్లో ప్రత్యేక కోటా లేకుండా బడుగు, బలహీనవర్గాల అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో 80 కోట్ల బీసీ జనాభా ఉన్నప్పటికీ పాలకులు బడ్జెట్లో నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల కల్పన అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, కల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, శ్యామ్, గణేశ్‌చారి, శేఖర్ సాగర్, మణిమంజరి తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ,జూన్ 10: ప్రభుత్వం జీవో నంబర్-7ను రద్దు చేసి, అదే స్థానంలో 8,9 జీవో తీసుకురావడం.. కొత్త సీసాలో పాత సారా అనేలా ఉన్నదని, ఇది సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. జీవో నంబర్-7ను రద్దు చేసి, 8,9 జీవో తీసుకురావడానికి నిరసనగా కాచిగూడ చౌరస్తాలో బుధవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహా ధర్నా చేపట్టారు. అనంతరం మాజీమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర మానుకోవాలని, ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, సీఎం అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు విద్యకు నోచుకోవడంలేదని ఆరోపించారు. తెలంగాణలో 18 మంది విద్యార్థులు చనిపోయినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు. ధర్నాలో నందగోపాల్, రవీందర్, మాణిక్, తిలక్‌సింగ్, వేణు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు యూనివర్సిటీ, జూన్ 10 : బీసీలు పార్టీలకతీతంగా ఐకమత్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. బుధవారం సామ్రాట్ కాంప్లెక్స్‌లోని బీసీ జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జేఎస్పీ చానల్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జాతి కోసం ఉద్యమాలు చేసేవారికి సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌తోపాటు వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.