సిద్దిపేట, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14 వేల కోట్ల అప్పు చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేసిన ప్రస్తుత సీఎం రేవంత్, ఇప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు.
శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండాభూదేవి గార్డెన్లో సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఎన్నికల హామీలను ఎట్లా ఎగ్గొటాలనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. హామీలన్నీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగానే అమలుచేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు అయిపోగానే హామీలపై చేతులెత్తేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
‘అన్ని పథకాలకు లెక్కలు సిద్ధ్దంగానే ఉన్నాయి కదా? అమలు చేయవచ్చు కదా? ఏం అడ్డం ఉన్నది మీకు?’ అని సూటిగా ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియోలను సమావేశంలో బీఆర్ఎస్ క్యాడర్‌కు చూపించి వారి తీరును ఆయన ఎండగట్టారు.
అబద్ధాలపై ఏర్పడిన ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ అబద్ధ్దాల ప్రచారంతో రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిందని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు.. నేడు పాలనలో అసహనం అని దుయ్యబట్టారు. కొన్ని యూట్యూబ్ చా నళ్లు కూడా బీఆర్ఎస్కు నష్టం చేశాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ చే యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు.
‘ప్రగతి భవన్లో ఏమోమో ఉన్నాయని ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇవాళ ప్రగతిభవన్‌లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు కదా? అందులో ఏం ఉన్నాయో చెప్పుమని మొన్న అసెంబ్లీలో అడిగితే వారి వద్ద సమాధానం లేదు. అంటే ఎన్నికల ప్రచారంలో అబద్ధ్దాలు చెప్పామని కాంగ్రెస్ నాయకులు అంగీకరించినట్టే కదా? నాడు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్తే కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
ఇవ్వాళ మీరు చేసింది ఏంటి? సచివాలయంలో లంకె బిందెలున్నాయనికొని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని సీఎం రేవంత్ అంటున్నారు. లంకె బిందెలు ప్రభుత్వ భవనాల్లో ఉంటాయా? అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలి. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? బీఆర్ఎస్కు ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్తకాదు. రైతులకు ఇప్పుడు 24 గంటలు కరెంట్ అమలు కావడం లేదు. ఎరువుల కొరత మొదలైంది’ అని హరీశ్‌రావు విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ మోసాలు
ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. ‘నాలుగు వేల ఫించన్ అన్నారు. మోసం చేసిండ్రు. రూ. 15 వేల రైతుభరోసా అన్నారు. ఇవ్వలేదు. వడ్లకు క్వింటాల్‌కు రూ 500 వడ్లకు బో నస్ అన్నారు. ఆ ఊసే లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. తొలి క్యాబినెట్లోనే మెగా డీఎస్సీ అన్నారు. ఇప్పటివరకు ఏమీ ఇవ్వకుండా మోసం చేశారు’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన కోటి 54 లక్షల మంది అక్కాచెల్లె లు ఉన్నారని, వారందరికీ నెలకు రూ.2,500 చొప్పున వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు భృతి ఇచ్చేదాకా ప్రభుత్వం వెంట పడుతామని తేల్చి చెప్పారు. హామీల గురించి అడిగితే కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ‘ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరందలేదని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మంత్రి కొండా సురేఖ వచ్చి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు రంగనాయకసాగర్ నుంచి లక్షా పదివేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఒక్క రంగనాయకసాగర్ నుంచే ఇన్ని ఎకరాలకు సాగునీరు అందితే, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ ఇలా వివిధ ప్రాజెక్టుల కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది కదా?’ అని ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.