సిద్దిపేట, ఏప్రిల్ 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఎన్నికల్లో రైతులు, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వద్దురో.. ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డిసెంబర్ 9నే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో పార్టీ అభ్యర్థి బీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ ఊసే ఎత్తడం లేదు. రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏమయ్యాయి? ప్రభుత్వంపై రైతులకు నమ్మకం లేక బయట రూ.1,800కే ధాన్యం అమ్ముకుంటున్నారు.
పంట చేతికి వచ్చినా ఇంతవరకు రైతు బంధు వేయని కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులు తగిన గుణపాఠం చెప్పాలి. రెండు నెలల్లో లక్ష లగ్గాలు జరిగాయి. వీరికి రేవంత్‌రెడ్డి లక్ష తులాల బంగారం బాకీ ఉన్నాడు. ఆరు గ్యారంటీలే గడ్డపారలై రేవంత్‌కు పోటు పొడవాలి. నాలుగు నెలలైన హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోదామా?’ అని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఓట్ల కోసం వస్తే కాంగ్రెస్ లీడర్లకు బుద్ధి చెప్పడానికి మహిళలు చీపుర్లు, చాటలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆడపిల్లల పెండ్లి తులం బంగారం ఇస్తానని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని హరీశ్‌రావు విమర్శించారు. బెజ్జంకి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, వాటిని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. బీజేపీ పదేండ్ల పాలనలో ప్రజలకు ఒక్క మేలైనా చేసిందా? అని ప్రశ్నించారు.
చెప్పుకోవటానికి ఏమీలేక క్యాలెండర్లు, అక్షింతలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే గొంతులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ కరీంనగర్‌కు రైలు తీసుకొచ్చారు. కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ నేతలు నేలకు దిగిరావాలంటే కరీంనగర్ పార్లమెంట్ నుంచి వినోద్‌కుమార్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలి’ అని కోరారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలో రూ.కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుకగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.