హన్వాడ, ఏప్రిల్ 10 : భూగర్భ జలా లు అడుగంటి.. బోరుబావులు ఒట్టిపోవడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పం దించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కరువొచ్చిందని అన్నారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అమటోనిపల్లి శివారులో ఎండిన వరి పంటలను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పంట ఎండిన పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. హన్వాడ మండలంలో 50 శాతం వరకు పంటలు ఎండిపోయాయని చెప్పారు. తెచ్చిన అప్పులు వడ్డీలు పెరిగి ఎలా తీర్చాలో ఆందోళన చెందుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.