Srinivas Goud | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నదని, అంధులని కూడా చూడకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహబూబ్‌నగర్‌లో వారి ఇండ్లను కూల్చివేసిందని మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం పేదల విషయంలో ఒకలా, పెద్దల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. కూల్చివేతలపై న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేయాలని, బీఆర్ఎస్ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌లోని అంధుల కాలనీకి అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి ఇండ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామగ్రి తీసుకునేందుకు సమయం ఇవ్వమని కోరినా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారని తెలిపారు.
2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి పట్టాలు ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు, కరెంటు ఇచ్చిందని వివరించారు. పింఛన్ డబ్బులతో వారు ఇండ్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. వారికి పట్టాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ చెరువు లేదని, కుంట లేదని, కోట్ల విలువ చేసే భూమి కూడా కాదని, అయినప్పటికీ ఎందుకు కూల్చారని ప్రశ్నించారు.
పేదల కోసం కాంగ్రెస్ ఎన్ని ఇండ్లు కట్టిందో తెలియదు కానీ, కట్టుకున్న ఇండ్లను మాత్రం కూల్చివేస్తున్నదని శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ మానవీయ కోణంలో స్పందించాలని కోరారు. ఇండ్ల కూల్చివేతలో పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
దివ్యాంగుల రూ. 4 వేల పింఛన్‌ను రూ. 6 వేలకు పెంచుతామని ఇప్పటి వరకు పెంచలేదని విమర్శించారు. కూల్చివేతల విషయంలో పేదల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి డబ్బులే కావాలనుకుంటే బిచ్చమెత్తి అయినా నిధులు సమకూరుస్తామని చెప్పారు. తాను ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.