మహబూబ్నగర్: గిరిజన జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత తరం మీద ఉందని చెప్పారు. గిరిజనులకి రాజ్యాధికారం కల్పించేందుకు తండాలను కేసీఆర్ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసారని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన హయాంలో మహబూబ్ నగర్ నియోజక వర్గ పరిధిలోని తండాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం, కమ్యూనిటీ హాల్స్, గ్రామపంచాయతీ భవనాలు, క్రిడా ప్రాంగణాలు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించినట్టు చెప్పారు.
గిరిజన భవన్, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలంతో పాటు రూ 1.10 కోట్ల నిధులు ఇచ్చి పనులు పూర్తి చేయించినట్టు చెప్పారు. గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు ప్రత్యేక వసతి గృహాలు నిర్మాణం చేసిన్నట్టు తెలిపారు.కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు,పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ నాయక్, రాంలక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, నవకాంత్, గణేష్, కిషన్ పవర్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.