కాచిగూడ, డిసెంబర్ 27: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని కుల, బీసీ, ఉద్యోగ, ప్రజా, న్యాయ, విద్యార్థి సంఘాలు ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈనెల 29న బీసీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఒక్క పార్లమెంట్ సభ్యుడితో కొట్లాడి రాష్ర్టాన్ని తీసుకొస్తే, వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, ఉదయ్, జయంతి తదితరులు పాల్గొన్నారు.