హిమాయత్‌నగర్, డిసెంబర్ 8: ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలనే డిమాండ్‌తో హెచ్‌సీయూ విద్యార్థి నాయకుడు రాకేశ్దత్తా ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన మహాపాదయాత్ర సోమవారం హిమాయత్‌నగర్ వైజంక్షన్ వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడుతూ వేల కోట్లు ఖర్చుచేసి సమ్మిట్, అందాల పోటీలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12.75లక్షల మంది విద్యార్థులకు ఫీజు బకాయి ఉండటం తో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం మేరకు సమ్మెను విరమించుకున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు పెండింగ్ ఫీజు బకాయిలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.