మహబూబ్నగర్ : తెలంగాణ నీటి వాటాపై గొంతెత్తాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నిద్రావస్థ వీడి పాలమూరు ప్రాజెక్టుపై పోరుబాటకు పార్టీలకతీతంగా అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాభివృద్ధితోపాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలన్నారు. కొట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలన్నారు. కృష్ణానది ఎగువన కర్ణాటకలో సముద్రమట్టానికి 519 ఎత్తులో ఉన్న ఆల్మట్టి డ్యాంను 524 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారని, దీంతో కన్నడ రాష్ట్రంలో లక్షా 50 వేల ఎకరాల భూమిని సేకరించడంతోపాటు వందలాది గ్రామాలు ముంపునకు గురికానున్నాయని చెప్పారు.
నీటి కేటాయింపులో ట్రిబ్యునల్ ఫైనల్ వాటా ఇచ్చే వరకు డ్యాం ఎత్తు పెంచే పనులు అడ్డుకోవాలని సూచించారు. రేవంత్ రేవంత్రెడ్డి ఆల్మట్టిపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశామని మిగతా పది శాతం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.