గద్వాల, మార్చి 26 : యాసంగి రైతులు సాగునీళ్లులేక పంటలు ఎండిపోయి లబోదిబోమంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు పంటలు పండితే.. రేవంత్ పాలనలో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. జోగుళాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడ్ రిజర్వాయర్ 104 ప్యాకేజీ కింద కేటీదొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, ఉమిత్యాల, గువ్వలదిన్నె గ్రామాల్లో ఎండిన పంటలను బుధవారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అక్కడి నుంచే నిరంజన్‌రెడ్డి కలెక్టర్ సంతోష్, ఇరిగేషన్ ఎస్ఈ రహిముద్దీన్తో ఫోన్లో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్ నీటిని త్వరలో కర్ణాటక ప్రభుత్వం నుంచి విడుదల చేయించాలని సూచించారు. అనంతరం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఇక్కడి ఎమ్మెల్యే, అధికారుల సూచనలతోనే రైతులు పంటలు సాగు చేయగా.. నేడు ఎండుతున్నా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన జిల్లా అని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పుకుంటారని, కానీ ఇక్కడ సాగైన పంటలు ఎండుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎంతోపాటు మంత్రులంతా వారి సీటును కాపాడుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. ప్రజలు, రైతులు నమ్మి ఓట్లేసినందుకు ప్రభుత్వం వారి గొంతు కోసిందని ధ్వజమెత్తారు. ఎండిన పంటలను పరిశీలించడంలో మంత్రులకు పట్టింపు లేదని.. సీఎంకు తీరిక లేదని విమర్శించారు.