హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటే లాఠీచార్జీయేనా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై జరిగిన లాఠీచార్జీని మంగళవారం ఓ ప్రకటనలో ఖండించారు. రైతులపై లాఠీచార్జి అమానుషమని, పాలనను గాలికి వదిలేసి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇతర రాష్ర్టాల్లో ప్రచారానికి వెళ్లారని దుయ్యబట్టారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఏయే జిల్లాల్లో ఎరువులు, విత్తనాలు ఎంత ఉన్నది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పత్తి విత్తనాల కోసమే కాకుండా ఎరువు కింద వాడే జీలుగ విత్తనాలకూ రైతులు ఆందోళన చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జీలుగ విత్తనాలకే దికులేకపోతే ఇక అసలు విత్తనాలు ఇస్తారని రైతుల్లో నమ్మకం ఎలా కలిగిస్తారని ప్రశ్నించారు. విత్తనాలు ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ర్టాన్ని విడిచి ముఖ్యమంత్రి కేరళ, పంజాబ్, ఉప ముఖ్యమంత్రి పంజాబ్, మంత్రులంతా రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, విత్తనాల కొరత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, వానకాలం సాగునీటి విడుదలపై ఇంతవరకు సమీక్ష లేదని, ప్రచారం ఫుల్లు.. పాలన నిల్లు అన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించారు.