వపపర్తి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ పాలనలో ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నారు. గ్యారెంటీల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. పండిన పంటను అమ్ముకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. రైతుభరోసా, బోనస్ అందక, అరకొర రుణమాఫీతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఇవేమీ మీ కండ్లకు కనిపించడం లేదా?’ అని ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వనపర్తి జనంబాట కార్యక్రమంలో చేసిన ఆరోపణలపై సోమవారం సాయంత్రం వనపర్తిలోని తెలంగాణ భవన్లో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఎవరి సంతోషం కోసం వనపర్తికి వచ్చి దుర్భాషలాడుతున్నారు? డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలకు వంతపాడుతూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు.
మా నేత కేసీఆర్ కూతురుగా నిన్ను గౌరవిస్తుంటే.. దానిని కాపాడుకోవడం లేదు. ‘నీళ’్ల బిరుదును నేను తెచ్చుకున్నది కాదు. పెట్టుకున్నది కాదు. కేసీఆర్ చొరవతో వనపర్తి నియోజకవర్గంలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చా. నీవు జైలుకు వెళ్లిన రోజు బాధపడ్డ’ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబురాలంటూ ఆర్భాటం చేస్తున్నదని, వీరి పాలనలో ఇప్పటివరకు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులో కేవలం ఆరు నెలల పనులు, దాదాపు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే.. ఉమ్మడి పాలమూరులో 12 లక్షల ఎకరాలకుపైగా సాగునీరందుతుందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండి సొంత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు వంత పాడుతూ కవిత ఎవరి కోసం జనంబాట చేపట్టిందో వివరించాలని డిమాండ్ చేశారు.
కక్షపూరితంగా కేసులు పెట్టించడం, అక్రమంగా ఆస్తులు సంపాదించడం, భూములు ఆక్రమించడం వాస్తవమైతే రుజువు చేసి శిక్షించవచ్చని సూచించారు. తనకు హైదరాబాద్‌లో ఎలాంటి విలాసవంతమైన ఫాంహౌజ్‌లు లేవని, కేసీఆర్ వ్యవసాయ పొలంలో నివాసం ఉంటే, దాన్ని ఫాంహౌజ్ అంటూ కాంగ్రెస్ చేసిన పాప ప్రచారానికి కవిత వంతపాడుతున్నదని దుయ్యబట్టారు. తన సొంతూరులోనే పొలంలో తాను ఇల్లు నిర్మించుకుని వ్యవసాయం, పాడిపశువులను పెంచుతున్నట్టు తెలిపారు. ‘నీకు గండిపేటలో ఉన్నట్టు విలాసవంతమైన ఫాంహౌజ్‌లు మాకు లేవు. మా అధినేత కూతురువన్న అభిమానంతో ఉంటే.. నీవు కాపాడుకోవడం లేదని పేర్కొన్నారు. ‘ఓటమి చెంది ఇంట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరావును నాడు ఖమ్మం జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించి పిలిచి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రిని చేసిన కేసీఆర్‌కు సలహాలిచ్చే స్థాయి నీది కాదు. కేసీఆర్ మానసిక బాధకు కారణంగా నిలిచిన నీవు.. హద్దులు తెలుసుకోవాలి. అనవసరంగా అభాండాలు వేయడం సరికాదు’ అని సూచించారు.