హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : అవగాహన, రైతులపై చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ ప్రభుత్వం బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదులుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారని, కృష్ణా జలాలు సగటున రోజుకు 30 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వ్యవస్థ పూర్తి సిద్ధంగా ఉన్నదని, నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా వట్టెం వరకు 27 టీఎంసీల నీటిని ఒడిసిపట్టే అవకాశం ఉన్నదని తెలిపారు.
ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు అన్న కారణంతోనే నీళ్లివ్వడం లేదని, పనులు మిగిలి ఉంటే ఈ 8 నెలల్లో పూర్తిచేసి నీరెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థను వాడుకోకపోవడం ఎంత తెలివితకువ తనమో రైతులు ఆలోచించాలని సూచించారు. కాళేశ్వరం విషయంలో మొదట ఇలాగే చేసి ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తున్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు-రంగారెడ్డి పనులను వేగవంతం చేశారని చెప్పారు. కరివెన నుంచి నీరు ముందుకుపోయేలా కాల్వల కోసం టెండర్లు పిలిస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. నాలుగు పంప్ హౌస్‌లు, ఐదు రిజర్వాయర్ల పనులు పూర్తిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వాడుకునే తెలివి లేదని విమర్శించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల కింద గతంలో కాంగ్రెస్ కేవలం 3.9 టీఎంసీల జలాశయాలను మాత్రమే ప్రతిపాదించారని గుర్తుచేశారు. కల్వకుర్తి కింద సొరంగ వ్యాసం చాలా తకువ పెట్టి ద్రోహం చేశారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి కింద దాదాపు 60 టీఎంసీల జలాశయాలు నిర్మించామని చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఐదు పంపులు ఒకేసారి నడిపే అవకాశం లేకుండా కాల్వల సామర్థ్యం తగ్గించి ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి ఇకడ రైతులు ఇబ్బందులు పడుతుంటే అమెరికాలో మిసిసిపి అందాలు చూస్తూ కూర్చుంటారా ? అని ప్రశ్నించారు. ‘వీరా పాలమూరు బతుకులను మార్చేది?’ అంటూ ఎద్దేవాచేశారు.
తెలంగాణ రైతులపై కుట్ర: ఆర్ఎస్పీ
తెలంగాణ రైతులపై కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం కంటే ఎకువ సామర్థ్యమున్న పంపులతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారని, ప్రపంచంలో అద్భుతాన్ని అధోగతి పాలుచేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని పదేపదే చెప్పుకొనే సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు ప్రాజెక్టు వద్దకు వెళ్లలేదని ఎద్దేవాచేశారు. ఇక్కడ రోజుకు 30 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలుస్తుంటే రేవంత్‌రెడ్డి అమెరికాలోని మిసిసిపి అందాలను ఆస్వాదిస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయని, ఆంధ్రా రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని, చంద్రబాబు ఆదేశాలమేరకే పనిచేస్తున్నారా? అని రేవంత్‌రెడ్డిని నిలదీశారు.
2016లో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఉండరాదని నాడు కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద చంద్రబాబు పట్టుబట్టారని గుర్తుచేశారు. తాజా బడ్జెట్లో పాలమూరు ప్రాజెక్టులకు కనీస కేటాయింపులు లేవని విమర్శించారు. సాగునీటి బడ్జెట్‌ను రూ.44వేల కోట్ల నుంచి 22వేల కోట్లకు కుదించారని చెప్పారు. మూసీ సుందరీకరణ మీద ఆసక్తి చూపుతున్న రేవంత్‌రెడ్డి ఆ ప్రాజెక్టు మూలంగా ఎంతమంది జీవితాలు బాగుపడతాయో?, ఎన్ని ఎకరాలకు నీరందుతుందో? రాష్ట్ర జీడీపీ ఎంత పెరుగుతుందో చెప్పాలని ప్రశ్నించారు. 1.50 లక్షల కోట్లతో మూసీని సుందరీకరిస్తామంటున్న రేవంత్‌రెడ్డి పాలమూరు మీద ఎందుకు ప్రేమ చూపడం లేదని నిలదీశారు. డ్రోన్ విషయంలో కేటీఆర్‌పై కేసు పెట్టారని, రాష్ట్రంలో రోజూ ఎన్ని డ్రోన్లు ఎగరడం లేదు? అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలనా? ప్రజలపై ప్రతీకార పాలనా? తెలంగాణ అంటేనే రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపమంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెల్ల ఏనుగులు అంటూ చంపే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.