హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఫార్మా క్లస్టర్‌కు భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులను, వారి పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఖండించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే దుస్థితికి రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా దౌర్భాగ్యం అన్నట్టుగా పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇండ్లు కూలగొడతారని ప్రజలు, భూములు లాకుంటారని రైతులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి.. ఆడబిడ్డలు, అవ్వాతాతలు, ఆటోడ్రైవర్లు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారని తెలిపారు. సంక్షేమ పాలన పోయి సంక్షోభ పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్ ఏర్పాటును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను నడిరాత్రి అరెస్టు చేయడమే ప్రజాపాలనా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రైతుల అరెస్టును ఖండించారు. కక్ష సాధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్తూనే ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. పచ్చని పొలాల్లో ఫార్మ క్లస్టర్ చిచ్చు పెట్టినందుకు ప్రశ్నిస్తే అరెస్టులా? అని మండిపడ్డారు. అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే, రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.