Niranjan Reddy | కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పాపాలకు ఇది పరాకాష్ట అని.. కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి డిమాండ్ చేశారు. ఇది ఆ మహిళలకు కాదు తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని.. రాష్ట్రంలో రైతులను, పంటల కొనుగోళ్లను గాలికి వదిలేసి అందాల పోటీలు నిర్వహించడ అవివేకమన్నారు. అందులోనూ పక్కన పాకిస్తాన్‌తో యుద్దం జరుగుతున్నదన్నారు. అయినా, అందాల పోటీల కోసం హైదరాబాద్‌లో చార్మినార్ వద్ద దుకాణాలు మూసివేయించి క్యాట్ వాక్‌లు నిర్వహించారన్నారు.
అందాల పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరి పోటీదారుల వరంగల్ పర్యటన కోసం అక్కడ ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకుంటున్నారన్నారు. అభాగ్యుల పొట్టగొట్టారని.. ఇప్పుడు అదే వరంగల్ పర్యటనలో ప్రపంచ సుందరి పోటీదారుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించడం తెలంగాణకు తీవ్ర అవమానమన్నారు. అప్పుల తెలంగాణ అని అవమానించారన్నారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చుకుంటూ ఖర్చు చేస్తున్నారన్నారు. రుణమాఫీ లేదని.. రైతుబంధు రాదు, రైతు బీమా లేదు.. కేసీఆర్ కిట్ రాదన్నారు. న్యూట్రిషన్ కిట్ ఎత్తేశారని.. ఆదాయం లేదని బీద అరుపులు అరుస్తున్నారని మండిపడ్డారు. కానీ అందాల పోటీల పేరుతో అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వాటితో తెలంగాణకు ఒరిగేది సున్నా .. ప్రజల సొమ్మును హారతి కర్పూరంలా ఖర్చు చేస్తున్నారన్నారు.