హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎల్ఎల్బీసీ చరిత్ర తెలియదని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన నోటి విలువ, నీటి విలువ తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్ఎల్బీసీకి సంబంధించి 1982, జూలై 29న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 306ను విడుదల చేసిందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఎస్ఎల్బీసీకి 1994లో కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చిందని, మరి 2014 వరకు ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ చరిత్ర తెలియకుండా రేవంత్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఏం చేశారో చెప్పకుండా ఎంతసేపూ మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావుపై నిందారోపణలు, విమర్శలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్రత్యేక పద్ధతిలో 14 ఏండ్లపాటు ఉద్యమం చేసిన కేసీఆర్ 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేశారని కొనియాడారు. భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎమ్మెల్యేగా, 4సార్లు ఎంపీగా, మొత్తంగా ఐదు దశాబ్దాలకు పైగా జాతీయ రాజకీయాలల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. వనరులు సమీకరిస్తూ ఇంజినీరింగ్ మార్వెల్ కాళేశ్వరాన్ని నిర్మించారని కొనియాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తిచేసినా కాంగ్రెస్ గత రెండేండ్లలో గడ్డపారతో ఒక్క పోటు కూడా పొడవలేదని విమర్శించారు. తెలంగాణలో జలసిరులు పారించి, వ్యవసాయరంగాన్ని కేసీఆర్ పండగలా చేశారని, తెలంగాణ వ్యవసాయాన్ని అగ్రభాగాన నిలబెట్టారని ప్రశంసించారు. విధ్వంసానికి వ్యూహం పన్నే మేధావులు టన్నుల కొద్దీ కక్కిన విషం వల్ల మరో తరం నష్టపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ జాతి ఎన్నడూ వారిని క్షమించదని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ చరిత్ర తెలియకుండానే రేవంత్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కుడివైపునకే ఎందుకు సమస్యలు?
“ఎస్ఎల్బీసీకి సమాంతరంగా కుడివైపు ప్రకాశం జిల్లా కొల్లం వద్ద రివర్స్ టన్నెల్ పెట్టి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అని పేరు పెట్టారు. నల్లగొండకు నీళ్లిచ్చే ఎస్ఎల్బీసీ టన్నెల్ పొడవు 42 కిలోమీటర్లు. కుడివైపు టన్నెల్ పొడవు 38 కిలోమీటర్లు. ఒకటే శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉన్న ఆ రెండు టన్నెళ్లు అదే నల్లమల అడవిలో ఉన్న పనులలో కుడిపక లేని పర్యావరణ ఇబ్బందులు ఎడమవైపునకు ఎలా వచ్చాయి? అటు వైపు టన్నెల్ ఎలా పూర్తయింది? ఇటు వైపు ఎందుకు ఆగిపోయింది? మీ వైఫల్యమే ఈ దుస్థితికి కారణం. అది మరిచిపోయి కేసీఆర్ మీద నిందలేస్తారా” అని నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ఎస్ఎల్బీసీలో ఆడిట్ సిస్టం లేకుండా పనులు చేపట్టడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ మిడిమిడి జ్ఞానంతో ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నదని మండిపడ్డారు.
పోతిరెడ్డిపాడును వ్యతిరేకించి రాజీనామా చేసిన కేసీఆర్
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అప్పట్లో ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ బయటకు వచ్చిందని, కేసీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేసి, 40 రోజులు శాసనసభను స్థంభింప చేశారని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. పాలమూరు రంగారెడ్డిలో మిగిలిపోయిన పది శాతం పనులను పూర్తి చేయకుండా, మళ్లీ కొడంగల్, నారాయణ పేట ఎత్తిపోతల చేపట్టారని ధ్వజమెత్తారు. రూ. 27 వేల కోట్ల పాలమూరు-రంగారెడ్డికి ఖర్చు పెట్టి నీళ్లివ్వలేదని ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. కేఎల్ఐ మోటారు ఏడాదిలో దాదాపు 200 రోజుల వరకు నడుస్తుంటే, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కేవలం 50 నుంచి 60 రోజులు మాత్రమే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్డీఎస్ను కాంగ్రెస్ నాశనం చేస్తే కేవలం 11 నెలల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేసి నీళ్లందించినట్టు చెప్పారు. కాంగ్రెస్ నేతలు వాగడం తప్ప రెండేళ్లలో ఒక వాగు మీద చెక్ డ్యామ్ నిర్మించలేదని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ వాళ్లు వణికిపోతున్నారని, బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ఈ ప్రెస్మీట్లో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్‌గౌడ్, కిశోర్‌గౌడ్, దాదన్నగారి విఠల్‌రావు పాల్గొన్నారు.