హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : ‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్‌పామ్ పరిశ్రమ నేడు అందుబాటులోకి వచ్చింది. నాడు ఆయిల్‌పామ్ సాగు వద్దన్నవాళ్లే.. నేడు ముద్దంటున్నారు. నాడు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినవాళ్లే.. నేడు వరి సాగు చేయొద్దని చెప్తున్నారు’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 16 నెలల్లో ఈ ప్రభుత్వం నర్మెట పరిశ్రమను పూర్తిచేస్తే, వనపర్తి జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఎందుకు పూర్తి చేయలేదు? అని నిలదీశారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విస్తరణకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహకారం, వ్యవసాయ మంత్రిగా తన కృషి ఎంతో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు కాంగ్రెస్ సరార్ రిబ్బన్ కటింగులు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇక్రిశాట్ ఎవరు స్థాపించారో, ఎప్పుడు స్థాపించారో, ఎకడ ఉందో తెలియని ముఖ్యమంత్రి, అది అమెరికా సంస్థ అని పేర్కొనడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతుభరోసా ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలకు కుదించడమే కాకుండా ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎకరాలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా ఇచ్చి, మిగతావాళ్లకు తరువాత చూద్దామన్నట్టు వ్యవహరించడం సరికాదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారెంటీ లేదని, ఇచ్చిన హామీలు మరచి రైతులను వేధిస్తున్నదని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.