వనపర్తి, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ వద్దే విద్యాశాఖ ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని, గురుకులాల పరిస్థితి దారుణంగా తయారైందని, సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ సంక్షేమ కళాశాల హాస్టల్లోని 40 మంది బాలికలు ఆహారం వికటించి దవాఖానలో చేరడంపై ఒక ప్రకటనలో నిరంజన్‌రెడ్డి స్పందించారు. రెండేండ్ల రేవంత్ పాలనలో గురుకులాల్లో నాణ్యతలేని భోజనంతో అనేక ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి తోడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తే.. నేటి సర్కారు పాలనలో గురుకులాల్లో చేరేందుకు జంకాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. కొత్తకోట ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్తకోట బాలికల హాస్టల్ వెల్ఫేర్ అధికారిణి, వర్కర్స్ సస్పెన్షన్
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని బీసీ బాలికల కళాశాల హాస్టల్లో శుక్రవారం రాత్రి ఆహారం వికటించి 40 మంది విద్యార్థినులు దవాఖాన పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురిపై వేటు పడింది. హాస్టల్ వెల్ఫేర్ అధికారిణితోపాటు మరో ఇద్దరు వర్కర్స్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి సస్పెండ్ చేశారు. జిల్లా కేంద్ర దవాఖానకు తరలించిన బాలికలను తెల్లారేవరకు మళ్లీ హాస్టల్‌కు తరలించడంపై పలు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దవాఖానలో ఉంచకుండా హడావుడిగా ఎందుకు తరలించారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.