హైదరాబాద్ జూలై 8 (నమస్తేతెలంగాణ): కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు మొదలై 40 రోజులైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు నడపకుండా నిర్లక్ష్యం చేసిన మంత్రులు.. బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తేగాని ఎందుకు కండ్లు తెరువలేదని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తిచేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని నిలదీశారు. కేఎల్ఐ మోటర్లను మధ్యలో నిలిపివేయకుండా కల్వకుర్తి ఆయక ట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. పాలమూరు పనులు పూర్తిచేసి ఏదులాపూర్, నార్లాపూర్, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపాలని కోరారు. అప్పుడు బీఆర్ఎస్లో ఇప్పుడు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఏ ఎండకు ఆ గొడుగు పట్టిన చందంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు.