హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ): పాలమూరు గడ్డ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రాజెక్టుకు రూ. 35, 200కోట్లు ఖర్చుచేసింది నిజంకాదా? గతంలో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేసింది కాంగ్రెస్ కాదా? ప్రాజెక్టు కాల్వల టెండర్లు రద్దు చేయడంతో రూ. 4 వేల కోట్ల భారం పెరిగింది వాస్తవంకాదా? అంటూ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నాస్ర్తాలు సంధించారు. పాలమూరు-రంగారెడ్డికి గత సర్కారు రూ. 27 వేల కోట్లు ఖర్చుచేసిందని రేవంత్‌రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీ, అసలు కలిపి రూ. 52,121 కోట్లు చెల్లించామని చెబుతున్న సీఎం ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే పాలమూరు పంపులు, లిఫ్ట్‌లు పూర్తిచేశారని చెప్పడం ఆయన అవగాహరాహిత్యానికి నిదర్శనమని దెప్పిపొడిచారు.