వనపర్తి, మే 3 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కారు కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ భస్మీపటలం కావడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించా రు. శుక్రవారం ఆయన వనపర్తిలోని తన నివాసం లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు కొత్త జిల్లాలను రద్దుకు కమిటీ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు.. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాలు ఏర్పడిన నాటి నుంచి ఆయా ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందినట్టు తెలిపారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు ఏర్పడినట్టు చెప్పారు. గతంలో పంజాబ్, హర్యానా కలిసి ఉండగా, కాంగ్రెస్ పార్టీనే రెండు రాష్ర్టాలుగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రెండు రాష్ర్టాల జనాభా దాదాపు 5 కోట్లపైబడి ఉండగా.. అక్క డ 46 జిల్లాలు ఉన్నాయని తెలిపారు. వాటితో పోల్చుకుంటే 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 33 జిల్లాలు తక్కువేనని ఉదహరించారు. జిల్లాల వ్యవస్థను తొలగిస్తామని వస్తున్న లీకులపై మంత్రి జూపల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ గోస తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరారు.