హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి పాలన రాచరికాన్ని తలపిస్తున్నదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమతో కలిసి ఆమె మాట్లాడారు. మహేశ్వరం నియోజక వర్గంలోని బాలాపూర్‌లో రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానం పట్ల అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వార్డు సభ్యులుగా గెలవలేని వారిని అధికారిక వేదికలపై కూర్చోబెడుతున్న కాంగ్రెస్ సర్కారు వైఖరిని తూర్పారపట్టారు.
రేషన్‌కార్డుల పంపిణీలో ప్రొటోకాల్ పాటించాలని సబితా ఇంద్రారెడ్డి కోరడం తప్పెలా అవుతుందని నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సబితకు, ఎమ్మెల్సీ సురభివాణీదేవికి కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మహేశ్వరం లాంటి పెద్ద నియోజక వర్గంలో ప్రభుత్వం కేవలం 1000 కార్డులు మాత్రమే ఇవ్వడం ఏంటని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి, మహిళలతో ఓట్లు వేయించుకుని, చివరకు వారినే అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. 4 లక్షల ఇండ్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు కేవలం 2 ఇండ్లను మాత్రమే పూర్తి చేసిందని, 2 ఇండ్లను కట్టడానికి 20 నెలల పట్టిన ఈ ప్రభుత్వానికి 4 లక్షల ఇండ్లు కట్టడానికి ఎన్ని నెలలు పడుతుందోనని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెసోళ్లు ఢిల్లీలో మరో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రొటోకాల్ ఉందా? లేదా?
కాంగ్రెస్ సర్కారులో ప్రొట్కాల్ పాటిస్తున్నారా? లేదా? అని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ప్రొటోకాల్ విషయంలో మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీరు దుర్మార్గం..
సబితా ఇంద్రారెడ్డి విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం దుర్మార్గమని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారిక వేదికలపై కాంగ్రెస్ నేతలను ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆ వేదికపై ఉండగానే సబితాఇంద్రారెడ్డికి అవమానం జరిగిందని తెలిపారు.