వికారాబాద్, నవంబర్ 11 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్న తల్లి లాంటి ఊరును, భూమిని కోల్పోతున్నామనే బాధ, ఆవేదన, ఆక్రోశం ప్రజల్లో ఉండటం సహజమని, వారి వైపు నుంచి కూడా ప్రభుత్వం ఆలోచించి న్యాయం చేయాలని సూచించారు. అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి రికార్డు సాధించారని ఎద్దేవాచేశారు. ఫార్మా కోసం కేసీఆర్ 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధంగా ఉంచారని గుర్తుచేశారు. కావాలనే అనేక చోట్ల ఫార్మా కంపెనీలు అంటూ ముఖ్యమంత్రి హంగామా చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా ప్రజలను ఒప్పించాలి గాని, ప్రభుత్వ నిర్ణయాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయవద్దని హితవుపలికారు. ఇప్పటికైనా ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం ఈ క్లస్టర్ల ఏర్పాటుపై పునరాలోచించాలని సూచించారు.