ఖమ్మం, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ, ఫ్యూచర్‌సిటీపై ఉన్న మోజు పేద విద్యార్థుల ఫ్యూచర్‌పై లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. శనివారం ఖమ్మం నగరంలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. విద్యాశాఖను సీఎం రేవంత్‌రెడ్డి తన దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి చదువు పట్ల ప్రేమ లేదని, ధ్యాసంతా కమీషన్ల మీదనే ఉందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విమర్శించారు. రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయా పార్టీలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ.. ఫీజులు విద్యార్థుల అకౌంట్లో వేస్తామని సీఎం చెప్తున్నారు.. పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ఫీజులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రావి శివరామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసే ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని గద్దె దింపితేనే పేద విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.