హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల సంఘాన్ని కోరారు.మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి సహా మరికొందరు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. రేవంత్‌రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ లీకులతో కాలక్షేపం చేస్తూ పోలీ సు అధికారులపై కేసులు పెడుతున్నారని, ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఇష్టంలేని అధికారులపై వేధింపులు
హోం మంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఫోన్ల ట్యాపింగ్ కేసును రోజూ పర్యవేక్షిస్తున్నారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ అనుకూలమైన మీడియా సంస్థలకు లీకులిస్తున్నారని పొన్నాల ఆరోపించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావును జైలులో వే స్తామని గతంలోనే బహిరంగంగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి సీఎం కాగానే తనకు ఇష్టంలేని అధికారులపై వేధింపులు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు.
కేసీఆర్, కేటీఆర్‌కు జైలుశిక్ష తప్పదని రేవంత్ మాట్లాడటాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించాలని కోరారు. రేవంత్ తన వ్యాఖ్యల ద్వారా ఫోన్ల ట్యాపింగ్ కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారని, రాజ్‌నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ కేసులో జ్యోక్యం చేసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.