హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, ప్రజలకిచ్చిన హామీల అమలు చేతగాక రేవంత్‌రెడ్డి దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని తిట్టిపోయడమే సంబురమా? అని నిలదీశారు.
తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, చాడ కిషన్‌రెడ్డి, మోయిన్ఖాన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తనతో చర్చకు వస్తావా రేవంత్? అని సవాల్ విసిరారు. వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కేసీఆర్ హయంలోనే జరిగిందని, కేవలం రంగులు వేసి క్రెడిట్ తీసుకోవడానికి రేవంత్‌కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి అబద్ధాల చక్రవర్తిగా మారారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఖాతాల్లో తప్పులే కారణమని వరంగల్ సభలో మరోసారి అబద్ధం చెప్పారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇదే ఖాతాదారులకు రైతుబంధు వేశారు? ఇపుడు ఎందుకు సాంకేతిక సమస్య అడ్డంకిగా మారింది? అని నిలదీశారు.
మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ అదానీతో కలిసి పోయారని విమర్శించారు. రేవంత్ తెలంగాణ పాలిట శాపంలా మారారని, రాజకీయాలను చిల్లర మల్లరగా మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌తో రేవంత్ అభివృద్ధిలో పోటీ పడాలి, తలసరి ఆదాయం పెంచడంలో పోటీపడాలని అని సూచించారు.