HomeTelanganaFormer Minister Niranjan Reddys Open Letter To Rahul Gandhi
ఫిరాయింపులు రాజ్యాంగబద్ధమా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్తున్న మాటలు. ఆచరణలో ఆయన చేస్తున్న పనులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
చెప్తున్న మాటలకు.. ఆచరణలో పనులకు పొంతనే లేదు
యాంటి డిఫెక్షన్ లా ను పటిష్ఠం చేస్తామన్న హామీ ఊమైంది?
రాహుల్‌గాంధీకి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్తున్న మాటలు. ఆచరణలో ఆయన చేస్తున్న పనులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ హయాంలో తెచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్ఠం చేస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపును యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న నేపథ్యంలో నిరంజన్‌రెడ్డి శనివారం రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత పటిష్ఠం చేస్తామని, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను రక్షించడం, గౌరవించడం తమ బాధ్యత అని తెలిపిందని గుర్తుచేశారు. కానీ అందుకు విరుద్ధంగా ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేసిన రాహుల్‌గాంధీ మరో చేత్తో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కరచాలనం చేశాడని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాడని దుమ్మెత్తిపోశారు. రాజకీయ విలువలు, ధర్మసూత్రాలకు రాహుల్ కట్టుబడి ఉంటే కాంగ్రెస్‌లో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు.
‘కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి తాము విలువలకు పట్టం కడుతున్నామని ఎందుకు చెప్పడం లేదు? డబుల్ స్టాండర్డ్ ఎందుకు? కేశవరావు రాజీనామా చేసినట్టు పార్టీలో చేరిన వాళ్లు రాజీనామా చేసి రావాలని రాహుల్‌గాంధీ ఎందుకు చెప్పడం లేదు?’ అని నిలదీశారు. ‘ప్రజా ప్రతినిధుల పార్టీ మార్పును నిస్సిగ్గుగా ఎలా స్వీకరిస్తారు? మాజీ స్పీకర్‌ను చేర్చుకుంటున్నామని గర్వం గా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం. రాహుల్ వీటిని ఎలా సమర్దించుకుంటున్నారు?’ అని ఓ సాధారణ నాగరికుడిగా ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఇలా లేఖతో వదిలిపెట్టబోమని, జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తామని, రాహుల్‌గాంధీ సమాధానం చెప్పేవరకూ నిలదీస్తామని హెచ్చరించారు.