హైదరాబాద్ మే 27 (నమస్తేతెలంగాణ): మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టుల కోరిక మేరకు వారితో శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మధ్యవర్తిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన మేరకు పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించిన మోదీ ప్రభుత్వం, మావోయిస్టులను మాత్రం నిర్మూలిస్తామని ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. అధికారం చేతిలో ఉన్నదని ఇష్టారాజ్యంగా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో 22 విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మా నం చేశాయని, అనేక ప్రజాసంఘాలు సైతం శాంతిస్థాపనకు కృషి చేయాలని విన్నవించినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంతోనే నక్సల్స్ నిర్మూలన సాధ్యమని, ఇందుకు కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దుకున్న తెలంగాణే సజీవ సాక్ష్యమని ఉద్ఘాటించారు.
కేంద్రంలోనీ బీజేపీ అధికారం చేతిలో ఉన్నదనే కారణంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. హోంమంత్రి అమిత్‌షా 2026లోగా మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటించడం బాధాకరమని పేర్కొన్నారు. వ్యక్తులను అంతమొందించడం ద్వారా వారి ఆలోచనలను నిర్మూలించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. మూల కారణాలను గుర్తించకుండా కాల్చి చంపడమే విధానంగా మార్చుకోవడం దారుణమని మండిపడ్డారు.
మధ్య భారత్‌లోని ఖనిజ సంపదను అదానీ లాంటి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్‌ను కేంద్రం చేపట్టిందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అందుకే మావోయిస్టుల హింసతోనే అభివృద్ధి ఆగిపోయిందని అసంబద్ధమైన వాదనను కేంద్రం తెరపైకి తెస్తున్నదని ధ్వజమెత్తారు. అదే నిజమైతే నక్సల్స్ లేని రాష్ట్రాల్లో అభివృద్ధిని అడ్డుకున్నదెవరు? అని ప్రశ్నించారు. ఫాసిస్టు విధానాలతో నక్సల్స్‌ను అంతమొందించాలని చూడటం సరికాదని సూచించారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు నిర్మించి గోదావరి, కృష్టా నదుల్లో నీళ్లు పారించడంతో రక్తపుటేరులు ఆగిపోయాయని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలకు చేతినిండా పని కల్పించడంతో మావోయిస్టులకు పనిలేకుండా పోయిందని ఉద్ఘాటించారు. ‘తుపాకీకి తుపాకీ, రక్తానికి రక్తం’ జవాబు కాదని తెలంగాణ రాష్ట్రమే గొప్ప ఉదాహరణ అని చెప్పారు. ఒకనాడు నక్సల్స్‌కు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణ ఈ రోజు ప్రశాంతంగా ఉందంటే కేసీఆర్ అనుసరించిన విధానాలే కారణమని విశ్లేషించారు.
నక్సల్స్ సమస్యను దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ సామాజిక కోణంలో చూడలేదని నిరంజన్‌రెడ్డి ఆక్షేపించారు. హింసాత్మక విధానంతో అణచివేయాలని చూశారని మండిపడ్డారు. దేశంలో ఎన్కౌంటర్లను సృష్టించిందే కాంగ్రెస్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనకు తప్పుడు మార్గంలో వెళ్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా నక్సల్స్ సమస్యను సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కానీ దుర్మార్గంగా వ్యవహరిస్తే తిరబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. సర్కారు తప్పిదాలను దేశం హర్షించదని, చరిత్ర క్షమించదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
చిక్కడపల్లి, మే 27: ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృ తదేహాల సామూహిక దహనం అప్రజాస్వామికం అని, బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని మా నవహక్కులు, ప్రజాసంఘాల నేత లు డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో శాంతి చర్చల సమన్వ య కమిటీ ప్రతినిధి ప్రొఫెసర్ హరగోపాల్, వేదిక కోఆర్డినేటర్ ప్రొఫెస ర్ గడ్డం లక్ష్మణ్, ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల తల్లిదండ్రులు, వామపక్ష పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వాలు నా కుమారుడి మొఖం కడసారి చూడకుండా చేశా యి. ఎన్కౌంటర్ తర్వాత నా కుమారుడి అంత్యక్రియలను చేసుకునే
అవకాశం కూడా ఇవ్వలేదు.
-స్వరూప, ఎన్కౌంటర్లో మరణించిన రాకేశ్ తల్లి