హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): లగచర్ల గిరిజన రైతులకు బెయిల్ రావడం కాంగ్రెస్ నిరంకుశత్వంపై రైతులు సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. ‘35 రోజుల తర్వాత అయినా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా లగచర్ల గిరిజన రైతులకు బెయిల్ రావడం సంతోషకరం. లగచర్ల గిరిజన బిడ్డలకు అడుగడుగునా అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ విజయమిది. అన్నదాత చేతులకు బేడీలు వేసిన రేవంత్ సరారుపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయమిది’ ఇది అని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రైతులను చెరసాలల్లో పెట్టి ప్రజా ఉద్యమాన్ని ఏ ప్రభుత్వమూ ఆపలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘లగచర్ల రైతులకు ఉద్యమాభివందనం.. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి’ అని బుధవారం ప్రకటనలో సూచించారు. లగచర్ల రైతులకు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్ మంజూరుపై హర్షం వ్యక్తంచేశారు.