వనపర్తి : పేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy )అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా దవాఖానను మంగళవారం సందర్శించారు. రోగులతో మాట్లాడి అక్కడే ఉన్న ప్రభుత్వ డయాగ్నస్టిక్స్ హబ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తుందన్నారు. గతంలో వనపర్తి టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ సిరిసిల్ల తర్వాత రెండోస్థానంలో ఉంది. సర్కారు నిర్లక్ష్యంతో నేడు 12వ స్థానానికి దిగజారింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
టీ డయాగ్నస్టిక్లో 134 టెస్టులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం జరుగుతున్నది 95 టెస్టులు మాత్రమేనన్నారు. కార్డియాలజిస్ట్ లేక 2డి ఎకో మిషన్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో పెట్టారు. రేడియాలజిస్ట్ కూడా లేరు. షుగర్ టెస్టులకు వాడే రీ ఏజెంట్స్ కూడా అయిపోయి నాగర్ కర్నూలు నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే షుగర్ టెస్ట్ చేస్తున్నారు. ప్రతి గర్భిణికి మూడు రకాల థైరాయిడ్ టెస్టులు చేయాల్సి ఉండగా దానికి సంబంధించిన మిషన్ మరమ్మతులో ఉండడంతో టెస్టులు చేయడం లేదు.
కనీసం పేదలు, గర్భిణులకు చిన్న చిన్న మెడికల్ టెస్టులు కూడా చేయలేని దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ ఆరోగ్యశాఖ కాంగ్రెస్ పాలనలో పక్క దారి పట్టిందని విమర్శించారు. పేద ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను ఎత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..కనీసం వైద్య పరీక్షలకు కూడా నోచుకోని పరిస్థితికి వైద్యశాఖను దిగజార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ హబ్ డయాగ్నోస్టిక్లో అన్ని రకాల పరీక్షలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్ లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.