హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నదని, ఇందుకు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే సాక్ష్యమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గప్పాలు కొట్టడం, కేసీఆర్‌ను తిట్టడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో సాధించిందేమీ లేదని దెప్పిపొడిచారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన బాగుంటే 85నుంచి 90శాతం ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వచ్చేవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 5 నుంచి 10శాతానికే పరిమితమైందని, ప్రస్తుత ఎన్నికల్లో అందుకు భిన్నంగా బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. చాలా జిల్లాల్లో మొదటి స్థానంలో ఉన్నదని, అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు గెలిచారని వివరించారు.
యథేచ్ఛగా అధికార దుర్వినియోగం చేసినా, సీఎం ప్రచారం చేసినా 50శాతం మించలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90శాతం సీట్లు గెలిచినా కేసీఆర్ గొప్పగా చెప్పుకోలేదని, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి మాత్రం కాకిలెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన ఆరోపణలు చేయడం దుర్మార్గమని నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆరోగ్యంపై అవహేళన చేస్తున్న రేవంత్‌రెడ్డి.. ఫిట్‌గా ఉన్న రాహుల్‌గాంధీ బీహార్ ఎన్నికల్లో సాధించింది నాలుగు సీట్లే కదా అని ఎద్దేవాచేశారు. తాము రేవంత్‌రెడ్డిలా సోనియా ఆరోగ్యంపై ఏనాడూ చౌకబారు వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి.. ఆర్నెలలు దాటకముందే మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు పోటీచేశారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ సక్సెస్ సాధించారని స్పష్టంచేశారు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీతో పాటు అత్యధిక మున్సిపాలిటీలను గెలుచుకున్నామని ఉదహరించారు. సంస్కరణల ముసుగులో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరులో నుంచి గాంధీ పేరును తొలగించడం తగదని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. అంతేగాక రాష్ర్టాలపై 40శాతం నిధుల భారం మోపడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షంగా నిలదీయాల్సిన కాంగ్రెస్ మౌనం వహించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఏటా ఎకరాకు రూ.15వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కేవలం ఒక్కసారి మాత్రమే జమచేసిందని విమర్శించారు.
మభ్యపెట్టేందుకే సీఎం మీడియా మీటింగ్ : దేవీప్రసాద్
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఓర్వలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలపై మభ్యపెట్టేందుకే మొన్న మీడియా సమావేశం పెట్టారని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. అధికార పార్టీ అరాచకాలకు ఎదురొడ్డి బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. సీఎం మాత్రం అభద్రతాభావంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అవాకులు చవాకులు పేలారని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కండ్లు తెరిచి పాలనపై, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
దొడ్డిదారిలో కాంగ్రెస్ గెలుపు : ఆనంద్
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దొడ్డిదారిలో విజయం సాధించిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్నదని తెలిపారు. మర్పల్లిలో ఒక్క ఓటుతోనే ఓడిపోయామని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన కొన్ని స్థానాల్లో కాంగ్రెస్. అక్రమ పద్ధతుల్లో గెలిచిందని ఆరోపించారు. మొహింకలాన్లో బీఆర్ఎస్ గెలిచినా రీకౌంటింగ్ చేసి కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని సూచించారు.
జలదోపిడీపై కేసీఆర్ పోరు
తప్పులు చెప్పడం, ప్రగల్భాలు పలకడం తప్ప ఏదీ చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు నీరందించాలనే సోయిలేకపోవడం సిగ్గుచేటని నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా బీఆర్ఎస్ హయాంలో 90శాతం పూర్తయిన పాల మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు సమీక్ష చేయలేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరూ ఏం చేశారో చెప్పాలి గానీ బీద అరుపులు ఎందుకని నిలదీశారు. ఈ నెల 21న కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న జల దోపిడీపై వివరిస్తారని ఆయన స్పష్టంచేశారు. అవసరమైతే పోరుబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం మానుకొని రైతాంగానికి యాసంగి బోనస్ ఎప్పుడిస్తరో? నిరుద్యోగులకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఎన్నడిస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు.