గద్వాల, ఫిబ్రవరి 1 : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న సోయి ఈ కాంగ్రెస్ ప్ర భుత్వానికి లేదని వ్యవసాయశాఖ మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించా రు. రేవంత్ సర్కార్ తీరుతోనే రైతు ఆ త్మహత్యలు పెరిగిపోతున్నాయని అ న్నారు. కాంగ్రెస్ సర్కార్ 423 రోజుల పాలనలో శుక్రవారం నాటికి 412 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్లో పల్లి, కంది రైతులను కలిశారు. వారికి అందుతున్న ధరను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన గద్వాలలోని బీఆర్ఎస్ భవన్లో మీడియా తో మాట్లాడారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో రేవంత్ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. ఫలితంగా నిత్యం ఏదో చోట రైతులు రోడ్డెక్కాల్సి న పరిస్థితులు తలెత్తినట్టు పేర్కొన్నారు. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వ్యవసాయ రంగా న్ని నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డా రు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్రమంగా రైతుల అభివృద్ధికి సహకరించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్నదాతలకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ వేసిందని తెలిపారు. మద్దతు ధర విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పల్లి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
నిరంజన్‌రెడ్డితో సమస్యలపై రైతుల ఏకరువు
గద్వాల మార్కెట్లో నిరంజన్‌రెడ్డి పలువురు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని రుద్రసముద్రానికి చెందిన రైతు వెంకటయ్య మాట్లాడు తూ.. తాను రెండెకరాలు పంట సాగు చేశానని, ఎకరాకు సుమారు రూ.40 వేల పెట్టుబడి అయిందన్నారు. ప్రస్తు తం పల్లి అమ్మితే రూ.50 వేలు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందాడు. గత ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చే సిందని, ప్రస్తుత ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో ఏమీ లేదని నిట్టూర్చాడు. కాగా అయిజ మండలం పర్దీపూర్‌కు చెందిన రైతు తిప్పన్న మాట్లాడుతూ.. తాను మూడెకరాల్లో పల్లి సాగు చేయ గా 82 సంచుల దిగుబడి వచ్చిందని తె లిపాడు. అన్ని ఖర్చులుపోనూ రూ.లక్ష వరకు అప్పు మిగిలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాడు. రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ నేతల అబద్ధపు మాటలు విని ఓట్లు వేశామని.. ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నాడు. మిట్టదొడ్డి గ్రామానికి చెందిన రైతు ఏసేపు మాట్లాడుతూ.. తాను మూడెకరాల పల్లి పంట సాగు చేయగా కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని చెప్పా డు. దీనికితోడు మార్కెట్లో ఉన్న ఆసాముల వద్ద పల్లీలు క్వింటా ధర రూ.12,500కు కొనుగోలు చేయగా వాటికి రూ.2 నుంచి రూ.4 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని వాపోయాడు. దీంతోపాటు కమీషన్ రూ.4 వసూలు చేస్తున్నారని, దీన్ని లెక్కల్లో చూపడం లేదని చెప్పాడు.