వనపర్తి : కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తిలో(Wanaparthi) మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలన సౌలభ్యం కోసం ఎంతో అధ్యయనం చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు.
జిల్లాల రద్దుపై ముఖ్యమంత్రి స్పందించాలని లేకుంటే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అలాగే ఈ విషయంపై జిల్లా మంత్రి కృష్ణారావు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. పోడు, కౌలు రైతులకు నాటి సీఎం కేసీఆర్ 4లక్షల 50వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి వారికి రైతుబంధు అందజేశారని పేర్కొన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచుతారన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఆలోచించి కేసీఆర్ ఆశీర్వదించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జెట్పీటీసీ రఘుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, మన్నెపు రెడ్డి, నందిమల్ల అశోక్ పాల్గొన్నారు.