హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డీ&అడ్డదిడ్డంగా మాట్లాడటం కాదు.. దమ్ముం టే నీళ్ల వాటాలపై కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పు..’ అంటూ మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నలకు బదులివ్వలేకే ఫ్రస్ట్రేషన్లో సీఎం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. ‘కాంగ్రెస్ రెండేండ్లపాలనలో విజయవంతంగా అమలు చేసిన ఒక్క పథకం పేరు చెప్పండి.. చేతనైతే 6 గ్యారెంటీలను అమలు చేసి చూపించండి’ అని డిమాండ్ చేశారు. సాగునీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టి అడ్డంగా దొరికిపోయి ప్రశ్నిస్తే ఓర్వలేకే విర్రవీగుతున్నారని నిప్పులు చెరిగారు. సీఎం వ్యవహారశైలితో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం, కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు.