హైదరాబాద్, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌పై పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గూండాలు మారణాయుధాలతో దాడికి దిగారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై డీజీపీ లేదా సీపీ వెంటనే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడి యా సమావేశంలో మాట్లాడారు. 50-60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ట్రాఫిక్ సిగ్నల్‌ను ఆపి కేటీఆర్ కాన్వాయ్‌పై మారణాయుధాలతో దాడికి దిగారని, ఇందుకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. కేటీఆర్ కారుపైకి ఓ రౌడీ ఎక్కి అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించాడని చెప్పారు. రక్షణగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపైనా దాడిచేశారని, ఈ దాడిలో హుస్సేన్, పవన్ గాయపడ్డారని వివరించారు.
మూడు నెలలుగా వరుస దాడులు
మూడు నెలలుగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై కాంగ్రెస్ వరుస దాడులు చేస్తున్నదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడూ కాంగ్రెస్‌తో ఉండే వ్యక్తి కాదని, కాంగ్రెస్‌ను రేవంత్ స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా మార్చుకున్నాడని, ఆ పార్టీని పాత నాయకులే రక్షించుకోవాలని చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తలా ఖమ్మం సీపీ
ఖమ్మం పోలీస్ కమిషనర్ కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని, తమపైనే దాడిచేసి తమ పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడి జరిగిన ప్రతిచోటా కాంగ్రెస్ వాళ్లే తమవద్దకు వచ్చారని, తాము వారి దగ్గరికి వెళ్లలేదనే విషయాన్ని పోలీసులు, ప్రజలు గుర్తించాలని చె ప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దమ్ముంటే మూసీ నిర్వాసితులతో మాట్లాడాలని సవాల్ విసిరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.