జడ్చర్ల టౌన్, డిసెంబర్ 18 : బీఆర్ఎస్ విజయ పరంపరను ఎవరూ ఆపలేరని, స్థానిక సంస్థల ఎన్నికల విజయం మొదలు ఎన్నికలేవైనా గులాబీ ప్రభంజనం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డుసభ్యులను లక్ష్మారెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాల్లో గెలుపొందడం చూస్తే మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టమవుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు పైసా నిధులు ఇవ్వలేదని, దీంతో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలను చూసే ఓటర్లు ఆ పార్టీ మద్దతుదారులకు బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. జడ్చర్ల సెగ్మెంట్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు.