పెద్దపల్లి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీయేనని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల్లో రూ.3 లక్షల 47వేల కోట్ల అప్పు చేసినా ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించలేదని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3,24,234 కోట్ల బడ్జెట్ అంకెల గారడీయేనని అభివర్ణించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల రాబడి రూ.1,11,798 కోట్లు వచ్చినట్టు గత బడ్జెట్లో పేర్కొన్న ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి రూ. 1,09,233 కోట్లు వచ్చినట్టు తాజా బడ్జెట్లో ప్రకటించడం రాష్ట్ర ఆదాయం పడిపోయిందనడానికి నిదర్శనమని తెలిపారు. తులం బంగారం, మహిళలకు ప్రతినెలా రూ.2,500, ఆరు గ్యారెంటీలకు ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని చెప్పారు. గత బడ్జెట్లో రూ.56,083 కోట్లు కేటాయించి, తాజా బడ్జెట్లో రూ.50,713 కోట్లకే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు.
ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్లు ఖర్చు చేసి 109 స్కూళ్లు కడుతామని చెప్పిన ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.2900 కోట్లు కేటాయించగా.. అందులో రూ.200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. బడ్జెట్లో రూ.5 వేల కోట్లే కేటాయించిందన్నారు. వ్యవసాయానికి గతేడాది రూ. 24,439 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 1,260 కోట్లు కోత పెట్టి.. రూ.23,179కోట్లకు కుదించిందని మండిపడ్డారు. రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.18వేల కోట్లే కేటాయించిందని మండిపడ్డారు.