హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఫార్ములా ఈ-రేస్ కేసుపై లైడిటెక్టర్ టెస్టుకు రావాలన్న కేటీఆర్ డిమాండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తోక ముడిచారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే కేటీఆర్‌పై కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. అందులో భాగంగానే ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్‌పై ఈ-రేస్ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీతో చీకట్లో చేతులు కలిపి, బీఆర్ఎస్పై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ కేసులో చట్టపరమైన స్థిరత్వం, వాస్తవ ఆధారాలు, సాక్ష్యాలు లేవని తెలిపారు. రెండేండ్లుగా ఈ-రేస్ కేసుపై విచారణ పేరిట సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను నిలువరించి, లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు కుట్రలకు దిగుతున్నారని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచిన కేటీఆర్‌పై ఇటు రేవంత్‌రెడ్డి, అటు బీజేపీ అక్రమ కేసులతో ఇరుకున పెట్టాలని చూస్తున్నట్టు విమర్శించారు. కేటీఆర్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేకే ఇలాంటి కుట్రలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బద్ద శత్రువులైన కాంగ్రెస్, బీజేపీలది తెలంగాణలో మాత్రం అన్నదమ్ముల అనుబంధం అని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడమే ఆ రెండు పార్టీల ఎజెండా అని ఆరోపించారు. బీహార్‌లో ఆర్జెడీని, యూపీలో సమాజ్‌వాదీ పార్టీని, కర్నాటకలో జేడీఎస్‌ను, ఢిల్లీలో ఆప్ పార్టీని, మహారాష్ట్రంలో ఎన్సీపీతోపాటు శివసేన పార్టీల వంటి అనేక ప్రాంతీయ పార్టీలను పూర్తిగా ఆ రెండు పార్టీలు బలహీన పరిచాయని గుర్తు చేశారు.