హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్, కవితపై ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆరోపణలు హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ఓర్వలేకే ఆయన ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక రీకౌంటింగ్ విషయంలోనూ సత్యదూరమైన ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఎస్ఎల్బీసీ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా స్పందించిందని లక్ష్మణ్‌కుమార్ చెప్పుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కార్మికుల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని విస్మరించి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
హరీశ్‌రావుపై కేసు కక్షసాధింపే ; బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కక్షసాధింపులో భాగంగానే మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో అక్రమ కేసు పెట్టిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. హైకోర్టు విచారణలో ఉన్న ఒకే అంశంపై మళ్లీ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయడమంటే న్యాయవ్యవస్థను అవహేళన చేయడమేనని మండిపడ్డారు. ప్రత్యర్థులను అణచివేయడానికి, ప్రజాస్వామ్యవాదులను వేధించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను పూర్తిగా రాజకీయ పావులుగా వాడుకుంటున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలపై ప్రత్యేకంగా హరీశ్‌రావు లాంటి నాయకులపై కేసులు పెట్టడమే పరిపాలన అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని పేర్కొన్నారు. సీఎం చెప్పిందల్లా వింటూ పోలీసులు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారకూడదని ఆయన సూచించారు. న్యాయాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరించడం సరికాదని హితవుపలికారు.