హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కొరతపై రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తుంటే.. మూలిగే నకపై తాటిపండు పడ్డట్టు పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సీఎల్ను షట్డౌన్ చేయడం ఏంటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకో రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నదని, రైతు కుటుంబాలు యూరియా కోసం వేచి చూడాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని మండిపడ్డారు. రైతులకు యూరియా కోటా పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా.. కాంగ్రెస్ సర్కారు మీనమేషాలు లెకిస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణతో పాటు ఆరు రాష్ట్రాలకు యూరియా సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీ మూతపడితే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణకు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, అందులో సగం మాత్రమే (15,924.87 మెట్రిక్ టన్నులు) సరఫరా చేశారని స్పష్టంచేశారు. ఒక వైపు ఉత్పత్తిలో ఇబ్బందులతోపాటు రాష్ర్టానికి ఇచ్చే యూరియా కోటాలో కేంద్ర ప్రభుత్వం తగ్గింపుతో కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయిందని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.