హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో మెరుగైన విద్యను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూ ళ్లు కాంగ్రెస్ పాలనలో సర్వనాశనమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. విద్యార్థులకు మెస్ బిల్లుల చెల్లింపుల్లోనూ నిర్లక్ష్యం చేస్తున్నద ని ఆరోపించారు. తద్వారా వేల మంది పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలోని 253 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలోని 26వేల మంది విద్యార్థులకు రెండేళ్లుగా బిల్లులు ఇవ్వకపోవడంతో స్కూళ్ల నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉన్నదని విచారం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు రెండు బడ్జెట్లలో నయాపైసా విడుదల చే యలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అడ్మిషన్లు లేక గురుకులాలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్‌కు దీటుగా చదువులందించిన 1,030 గురుకులాలు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ 20 నెలల పాలనలో 103 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో మరణించడం బాధాకరమని పేర్కొన్నారు.
జీవో-17ను రద్దుచేయాలి
హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరా టెండర్లను బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం జీవో-17 జారీ చేసిందని కొప్పుల ఆరోపించారు. గతంలో స్థానికంగా ఉండే చిన్న కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ కార్పొరేట్ కాంట్రాక్టర్ల మేలు కోసం సెంట్రలైజ్డ్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. జీవో-17ను రద్దుచేసి పాత పద్ధతిలోనే టెండర్లు పిలువాలని డిమాండ్ చేశారు.